• ప్రశ్నిస్తే.. ఫోన్ కట్‌తోనే సమాధానమా?
• మూడు రోజులు బస్సులు వచ్చి.. మళ్లీ అదే పరిస్థితి
పాలెం: పాలెం బస్టాండ్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బస్టాండ్‌లోకి బస్సులు సక్రమంగా రాకపోవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే నిలబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై ఇప్పటికే తొలి కిరణం పత్రికలో ‘పాలెం బస్టాండ్‌లోకి రాని బస్సులు’ అనే కథనం ప్రచురితమైనప్పటికీ, అధికారులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపకపోవడం గమనార్హం. పాలెం బస్టాండ్‌లోకి బస్సులు రావడం లేదని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో గతంలో ఈ అంశంపై పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. కథనాలు ప్రచురితమైన అనంతరం కొద్దిరోజుల పాటు బస్సులు బస్టాండ్‌లోకి వచ్చినప్పటికీ.. మూడు రోజులకే మళ్లీ అదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు సమస్యపై వివరణ కోరేందుకు వార్తా ప్రతినిధి డిపో మేనేజర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఫోన్ కాల్‌కు స్పందించకుండా కాల్ కట్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై అధికారులను సంప్రదించినప్పుడు కనీసం స్పందించి సమస్యను తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రయాణికులు అంటున్నారు. ప్రజల సమస్యను చెప్పేందుకు ఫోన్ చేసినా మాట్లాడేందుకు సమయం లేకపోతే.. సమస్యను పరిష్కరించేది ఎవరు? అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేలా డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు వాటి అమలు తీరును అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాలెం బస్టాండ్‌ను పరిశీలించాలని, బస్సులు బస్టాండ్‌లోకి ఎందుకు రావడం లేదనే అంశంపై విచారణ చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే డిపో మేనేజర్ స్థాయి అధికారి ప్రజల ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంపై కూడా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. పాలెం బస్టాండ్ సమస్యపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇకనైనా మేల్కొంటారా? ప్రయాణికుల గోడు వింటారా? సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా? అన్నది వేచి చూడాల్సిందే.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


