బిజినపల్లి: మండలంలో విద్యా, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుప్పల్లి అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం బిజినపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శ్రావణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గుప్పల్లి అశోక్ మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధిక గ్రామపంచాయతీలు, విస్తీర్ణం కలిగిన మండలాల్లో బిజినపల్లి ఒకటని, అలాంటి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం సరిపడా వైద్యులు లేకపోవడం దుర్మార్గమని అన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందకపోవడంతో మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారని, సరైన వైద్య సదుపాయాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని వెంటనే నియమించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మండల కేంద్రంలోని బాలికల పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని, గురుకుల పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. మండలానికి రెగ్యులర్ ఎంఈఓను నియమించాలని డిమాండ్ చేశారు.
హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పాలెం గ్రామంలోని హాస్టల్కు నూతన భవనం నిర్మించి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
విద్యా, వైద్య రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని గుప్పల్లి అశోక్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి హనుమంతు, సీనియర్ నాయకులు శుభాకర్, మల్లేష్, రాములు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


