గద్వాల, ఆగస్టు 31: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుండగా.. మరో వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
పోలీసుల అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ఇటిక్యాల మండలం శెనిగపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి సుమారు 6 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న గంజాయి బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని అంచనా.
మార్కెట్ యార్డు ప్రాంతంలో ఇంత భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటంతో గద్వాల పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల సరఫరా జరుగుతోందా? అనే ప్రశ్నలు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఘటన నేపథ్యంలో పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, గంజాయి సరఫరాకు అవకాశం ఉన్న మార్గాలు, ప్రధాన స్థావరాలపై పోలీసులు మరింత నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గంజాయి రహిత గద్వాల కోసం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి.. సరఫరా వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గమనిక: ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితులపై నమోదైన కేసు తదితర అంశాలపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


