సికింద్రాబాద్, ఆగస్టు 30:
వయస్సును లెక్కచేయకుండా సీనియర్ సిటిజన్లు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని కొనసాగిస్తే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన “మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఆఫ్ సీజన్ మీట్–2026” కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీపడి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మెడల్స్, బహుమతులను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే” అని అన్నారు. వయస్సు పెరిగే కొద్దీ శారీరకంగా, మానసికంగా చురుకుదనాన్ని కొనసాగించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. సీనియర్ సిటిజన్లు ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొని, క్రీడా స్ఫూర్తితో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పతకాలు సాధించడం అభినందనీయమన్నారు.
సీనియర్ క్రీడాకారుల పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని అన్నారు. ప్రతి వయస్సు వారు క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు. సీనియర్ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా క్రీడా సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



