• అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. శివారు ప్రాంతాల్లో విస్తృతంగా డ్రోన్ నిఘా
• పేకాట, కోళ్ల పందేలు, గంజాయి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి
చిట్వేల్, తొలి కిరణం న్యూస్:
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, కోడూరు సీఐ డి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో చిట్వేల్ మండలంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
మండలంలోని మల్లంపల్లి, జట్టువారిపల్లె, తుమ్మకొండ గ్రామాల పరిధిలోని శివారు ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలను ఎగురవేసి పోలీసులు విస్తృతంగా పర్యవేక్షణ చేపట్టారు. ముఖ్యంగా పేకాట, కోళ్ల పందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలతో పాటు గంజాయి నిల్వ, వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. డ్రోన్ నిఘా ద్వారా గుర్తించిన అనుమానాస్పద కదలికలు, ప్రదేశాలపై ప్రత్యేక పోలీసు సిబ్బంది ద్వారా వెంటనే స్పందించి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
మండలంలోని మరిన్ని గ్రామాల్లోనూ అవసరాన్ని బట్టి డ్రోన్ నిఘాను విస్తరించి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి
గ్రామాల్లో పేకాట, కోళ్ల పందేలు, గంజాయి కార్యకలాపాలు, బహిరంగంగా మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


