మేడ్చల్–మల్కాజ్గిరి, ఆగస్టు 29: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర న్యాయం అందేలా అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ జిల్లా కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు, డీవీఎంసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ఎస్సీ/ఎస్టీ కేసులకు సంబంధించిన బాధితులు, పిటిషన్‌దారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులను కఠినంగా అరికట్టాలని గతంలో జరిగిన డీవీఎంసీ సమావేశాల్లో అధికారులకు పలుమార్లు స్పష్టంగా సూచించినట్లు తెలిపారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయకుండా వెంటనే కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. అయితే కొన్ని అంశాల్లో ఆశించిన స్థాయిలో చర్యలు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఒకే వ్యక్తి పలుమార్లు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అంశాలను కూడా సీరియస్‌గా పరిగణించి, వాస్తవాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను కోరారు.
అల్వాల్‌కు చెందిన పద్మిని అజిత్ సాయి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును రీ-ఓపెన్ చేయాలని గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసు పురోగతిపై స్పష్టత ఇవ్వాలని అధికారులను కోరారు.
అలాగే ఇటీవల లాల్‌గడి మలక్‌పేట్ మాజీ సర్పంచ్ చీదు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఆవరణలో దళిత నాయకుడు ఢిల్లీ పరమేష్ ఇచ్చిన ఎస్సీ/ఎస్టీ ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసు అధికారులను పలుమార్లు కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ వ్యవహారంలో సరైన ఆధారాలు, సమాచారాన్ని అందించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడం అధికారుల బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి నిర్లక్ష్యపూరిత చర్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
గత డీవీఎంసీ సమావేశాల్లో నమోదు చేసిన మినిట్స్‌ను పూర్తిగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అంశాలపై స్పష్టమైన పురోగతి సాధించాలని సూచించారు. పెండింగ్ కేసులను నిరంతరం సమీక్షిస్తూ బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, బాధితులకు న్యాయం జరిగే వరకు తన వంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులు వినోద్, రాంబాబు నాయక్, జిల్లా అధికారులు శంకర్, పోలీసు ఉన్నతాధికారులు గోపాలకృష్ణ, శంకర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, నరేష్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, డీవీఎంసీ జిల్లా స్థాయి సభ్యులు బొట్ల వెంకటేశ్వర్లు, అశోక్, చరణ్గిరి, ధనరాజ్ నాయక్, బాబురావు, ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, బాధితులు, పిటిషన్‌దారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


