నాగర్‌కర్నూల్, మంతటిగడ్డ: నాగర్‌కర్నూల్ జిల్లా మంతటిగడ్డ ప్రాంతంలో ఓ యాదవ కుటుంబానికి చెందిన సొంత స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టారని బాధితులు ఆరోపించారు. నాగరాజు యాదవ్‌కు చెందిన ప్లాట్‌లో ఎర్రమోని సలేశ్వరం అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పేరుతో దిమ్మె నిర్మించారని, దీనిపై ప్రశ్నించిన తమ కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని నాగరాజు ఆరోపించారు.
తన స్థలాన్ని ఎలా విక్రయిస్తావో చూస్తానని, తన అంతు చూస్తానంటూ సలేశ్వరం బెదిరిస్తున్నారని నాగరాజు తెలిపారు. ఈ ఘటనతో తమ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు జరిగిన అన్యాయంపై నాగరాజు యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భైకుని శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కాశన్న యాదవ్, జిల్లా అధ్యక్షుడు లాలూ యాదవ్, జిల్లా యువజన అధ్యక్షుడు మూర్తి యాదవ్, తిరుపతయ్య యాదవ్, జిల్లా టౌన్ అధ్యక్షుడు కళ్యాణ్ యాదవ్, నాగర్‌కర్నూల్ మండల అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, బిజినపల్లి మండల అధ్యక్షుడు బక్క మల్లేష్ యాదవ్‌తో పాటు పలువురు యాదవ సంఘం నాయకులు, పెద్దలు మంతటిగడ్డకు చేరుకున్నారు.
వారు నాగరాజు యాదవ్‌కు చెందిన స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వారం రోజుల్లో తొలగించాలి
స్థలంలో నిర్మించినట్లు ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ దిమ్మెను వారం రోజుల్లోగా తొలగించాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నిర్ణీత గడువులోగా దిమ్మెను తొలగించకపోతే గొల్ల కురుమలు, యాదవులు అందరం కలిసి దాన్ని తొలగిస్తామని హెచ్చరించారు.
అలాగే నాగరాజు యాదవ్ కుటుంబానికి ఏదైనా హాని జరిగితే అందుకు ఎర్రమోని సలేశ్వరమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి వాస్తవాలను పరిశీలించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని యాదవ సంఘం నాయకులు కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



