బీజినేపల్లి: మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వెలసిన శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం కృష్ణ పక్ష పాడ్యమి, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర నక్షత్రాల సందర్భంగా శనిగ్రహ దోష నివారణ కోసం శ్రీ సార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామివారికి భక్తులు తిలతైల అభిషేకాలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ శ్రావణ మాసంలో శనేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోషాలు ఉన్నవారు తమ శక్తిమేరకు స్వామివారిని పూజించి ఆశీస్సులు పొందాలని సూచించారు.
అనంతరం ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మసూత్రం కలిగిన పరమశివునికి భక్తులు రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చన పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరాచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్‌చారి, శ్రీకాంత్‌రెడ్డి, ఆలయ అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):


