బిజినపల్లి, ఆగస్టు 29: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడినట్లు సమాచారం.
అనకంపల్లి తండాకు చెందిన ఐదుగురు వ్యక్తులు షిఫ్ట్ డిజైర్ కారులో (TS 31 TA 2215) నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి వెళ్తుండగా.. వట్టెం నుంచి బిజినపల్లి వెళ్లే మార్గంలోని పౌల్ట్రీ ఫారం షెడ్ సమీపంలో ఎదురుగా వచ్చిన మహీంద్రా థార్ వాహనం ఢీకొన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో షిఫ్ట్ డిజైర్ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాదంలో కారు డ్రైవర్ బాదావత్ మోహన్ (శ్రీను కుమారుడు) తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కారులో ఉన్న మరో నలుగురికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా, ప్రమాదానికి గురైన మహీంద్రా థార్ వాహనంలో మద్యం సీసాలు ఉన్నట్లు సమాచారం. దీంతో వాహన డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డ్రైవర్ మద్యం సేవించాడా లేదా? ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



