పుల్లంపేట, ఆగస్టు 29: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో ఆటో డ్రైవర్‌పై దాడి చేసి ఆటో, రూ.6 వేల నగదు, మొబైల్ ఫోన్ దోపిడీ చేసిన ఇద్దరు నిందితులను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దోపిడీకి గురైన ఆటో, మొబైల్ ఫోన్‌తో పాటు నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, రింగ్ స్పానర్ను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ పర్యవేక్షణలో, రేణిగుంట ఎస్డీపీవో శ్రీ వై. శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో రైల్వే కోడూరు రూరల్ సీఐ శ్రీ డి. శ్రీనివాసులు, పుల్లంపేట ఎస్ఐ శ్రీ వి. చిన్న రెడ్డెప్ప, సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.
2025 జూలై 31న రాత్రి రాజంపేటలో ఆటో డ్రైవర్ మేకల హనుమంతు వద్దకు వచ్చిన ఇద్దరు నిందితులు ఆటోను బాడుగకు మాట్లాడుకుని అనంతసముద్రం పరిసరాల్లోని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆటోలో ఉన్న ఇనుప రాడ్డు, రింగ్ స్పానర్లతో డ్రైవర్‌పై దాడి చేసి గాయపరిచి, అతని వద్ద ఉన్న రూ.6 వేల నగదు, VIVO మొబైల్ ఫోన్‌తో పాటు ప్యాసింజర్ ఆటోను బలవంతంగా దోపిడీ చేసి పరారయ్యారు.
కేసు నమోదు అనంతరం పోలీసులు ఆధారాలను సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 27 సాయంత్రం పుల్లంపేట వద్ద హస్తవరం ఈశ్వరయ్య (26), బాలిపోగు రెడ్డెయ్య (25)లను అరెస్ట్ చేశారు. వారి సమాచారంతో దోపిడీకి ఉపయోగించిన ఆయుధాలతో పాటు ఆటో, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మరో వ్యక్తి వద్ద కుదువ పెట్టిన VIVO మొబైల్ ఫోన్‌ను చిన్న ఓరంపాడు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు: బజాజ్ గోల్డెన్ ఎల్లో కలర్ ప్యాసింజర్ ఆటో (AP39-TD-5768), VIVO Y27 మొబైల్ ఫోన్, ఇనుప రాడ్డు (వీల్ నెట్ స్పానర్), రింగ్ స్పానర్.
నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో చురుకుగా వ్యవహరించిన పుల్లంపేట సీఐ డి. శ్రీనివాసులు, ఎస్ఐ వి. చిన్న రెడ్డెప్ప, ఏఎస్ఐ సుబ్బయ్య, పీసీలు శ్రీహరి, బ్రహ్మానందరెడ్డి, ప్రసాద్, విజయ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.
రాత్రి వేళల్లో అపరిచితులను నమ్మి జనసంచారం లేని ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ప్రయాణికుల వివరాలను సాధ్యమైనంత వరకు గమనించాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నేరస్థులు ఎంతకాలం తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేరని, నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.


