ఓబులవారిపల్లి, ఆగస్టు 28 (తొలి కిరణం న్యూస్): ఓబులవారిపల్లి మండలం మంగంపేటలోని కడప–చెన్నై జాతీయ రహదారిపై చెన్నకేశవ స్వామి ఆలయం సమీపంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పలువురు మహిళలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
కోడూరు పట్టణానికి చెందిన పెళ్లి బృందం చిన్న ఓరంపాడు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుక ముగించుకుని ఆనందంగా స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో ఆలయం సమీపంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు, వైద్య సిబ్బంది అత్యవసర వైద్య సేవలు అందించారు. తీవ్రంగా గాయపడిన మహిళలకు చికిత్స అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న కోడూరు పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీహెచ్ రమేష్ బాబు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయ సహకారాలు అందించారు.
పెళ్లి వేడుకకు వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


