పానగల్, ఆగస్టు 28: ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడంతో పాటు వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపినా అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రజలు ఒక సమస్య పరిష్కారం కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
శుక్రవారం పానగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయం, విద్యుత్, పోలీస్, దేవాదాయ, అటవీ, పౌరసరఫరాలు తదితర శాఖలకు సంబంధించిన ప్రజా ఫిర్యాదులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. గత రెండున్నరేళ్లలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు అందిన ఫిర్యాదులు, పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉన్న వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పానగల్ మండలానికి సంబంధించి మొత్తం 489 వినతులు అందగా, 373 వినతులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. మరో 50 వినతులు పరిష్కరించాల్సి ఉన్నట్లు తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించి వచ్చిన వినతుల్లో 60 పరిష్కరించగా, 19 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పానగల్ తహసీల్దార్ పరిధిలో 99 వినతులు అందగా, 68 పరిష్కరించగా మరో 31 పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి
సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి అన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను గరిష్ఠంగా వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేయాలని సూచించారు.
వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ప్రింట్ తీసి సంబంధిత రికార్డుల్లో నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ చిరునామా, ఫోన్ నంబర్ వివరాలతో సమస్యలను సంబంధిత శాఖాధికారులకు పంపుకోవచ్చని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు.
పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదుదారులు సమర్పించిన దరఖాస్తులను ఒక్కొక్కటిగా పరిశీలించి, పెండింగ్‌కు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష
కొల్లాపూర్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ ఆర్థిక స్థోమత లేక నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. తదుపరి సమీక్ష నాటికి ఆయా లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు నాలుగో విడత నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు.
మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు స్థానికంగానే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా స్థాయి కార్యాలయాల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు.
ఈ సమీక్షలో అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతి, ఏడీ శ్రీనివాసులు, ఆర్డీఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



