న్యూఢిల్లీ, ఆగస్టు 28: భారత్ అమెరికా నుంచి అత్యాధునిక జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయనున్నట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. యుద్ధంలో ఇప్పటికే సమర్థతను నిరూపించుకున్న FGM-148 జావెలిన్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయనున్నట్లు ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదిత కొనుగోలు భారత్–అమెరికా రక్షణ సంబంధాల్లో కీలక ముందడుగు అని సెర్గియో గోర్ తెలిపారు. ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి, భవిష్యత్తులో ఆయుధాల సహ ఉత్పత్తికి కూడా ఇది అవకాశాలను పెంచుతుందని పేర్కొన్నారు.
గతేడాదే అమెరికా ఆమోదం
భారత్కు జావెలిన్ వ్యవస్థల విక్రయానికి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ 2025 నవంబర్లో సుమారు 45.7 మిలియన్ డాలర్ల విలువైన సంభావ్య విక్రయానికి ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో 100 జావెలిన్ రౌండ్లు, 25 కమాండ్ లాంచ్ యూనిట్లు, శిక్షణ, విడిభాగాలు, లాజిస్టికల్ సపోర్ట్ తదితరాలు ఉన్నాయి.
ట్యాంకులను ధ్వంసం చేసే పోర్టబుల్ ఆయుధం
జావెలిన్ ఒక సింగిల్ మ్యాన్-పోర్టబుల్, ఫైర్-అండ్-ఫర్గెట్ యాంటీ ట్యాంక్ వ్యవస్థ. లక్ష్యాన్ని లాక్ చేసిన అనంతరం క్షిపణి స్వయంచాలకంగా లక్ష్యాన్ని అనుసరించే విధంగా రూపొందించారు. దీంతో ప్రయోగించిన వెంటనే ఆపరేటర్ సురక్షిత ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
భారత సైన్యానికి ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే శత్రు దేశాల సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులను ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరగనుంది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


