హైదరాబాద్: సెల్‌ఫోన్ చోరీలను సైబర్ నేరాలతో ముడిపెట్టి అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే బస్సులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో స్మార్ట్ఫోన్లు వినియోగించే వృద్ధులు, అమాయకులను నిందితులు ముందుగా గుర్తిస్తున్నారని తెలిపారు. బాధితులు ఫోన్ అన్‌లాక్ చేసే సమయంలో ప్యాటర్న్, పిన్, పాస్‌వర్డ్‌ను గమనించి.. అదును చూసి మొబైల్‌ను చోరీ చేస్తున్నారని వివరించారు.
ఫోన్ లాక్ అయి ఉంటే సోషల్ ఇంజినీరింగ్ ద్వారా పాస్వర్డ్ రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీ తెలిపారు. తాము బస్సు కండక్టర్, డ్రైవర్ అని చెప్పడం, ఫోన్ తమకు దొరికిందని నమ్మించడం వంటి మాయమాటలతో బాధితుల నుంచే స్క్రీన్ లాక్ వివరాలు తెలుసుకుంటున్నారని చెప్పారు.
ఫోన్ అన్‌లాక్ అయిన తర్వాత గ్యాలరీ, నోట్స్, మెసేజ్‌లు, వాట్సాప్ చాట్లను పరిశీలించి బ్యాంకు ఖాతాలు, కార్డులు, ఆధార్, పాన్, పాస్వర్డ్లు, పిన్‌లకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. అనంతరం చోరీ చేసిన సిమ్ ద్వారా ఓటీపీలను ఉపయోగించి యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలను నియంత్రణలోకి తీసుకుని క్షణాల్లో నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేస్తున్నారని వివరించారు.
ఈ నేరాలకు పాల్పడుతున్న ముఠాలో ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఉంటుందని సీపీ వెల్లడించారు. బాధితులను గుర్తించడం, ఫోన్లు చోరీ చేయడం, పాస్వర్డ్లు రాబట్టడం, బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడం, మ్యూల్ ఖాతాలు లేదా డిజిటల్ వాలెట్ల ద్వారా నగదును మళ్లించడం వంటి పనులను వేర్వేరు వ్యక్తులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు
మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఎవరైనా కండక్టర్, డ్రైవర్ అని చెప్పినా స్క్రీన్ లాక్ పిన్, పాస్వర్డ్ చెప్పకూడదు.
బ్యాంకింగ్ ఓటీపీ, యూపీఐ పిన్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించకూడదు.
డెబిట్/క్రెడిట్ కార్డుల ఫోటోలు, CVV, ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్ వివరాలను గ్యాలరీ లేదా నోట్స్ యాప్‌లో భద్రపరచకూడదు.
ఫోన్ పోయిన వెంటనే టెలికాం సంస్థను సంప్రదించి సిమ్‌ను బ్లాక్ చేయాలి.
బ్యాంకును సంప్రదించి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలి.
CEIR అధికారిక పోర్టల్‌లో IMEI నంబర్ నమోదు చేసి ఫోన్‌ను బ్లాక్ చేయాలి.
ఖాతా నుంచి అనధికారికంగా డబ్బు కట్ అయితే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలి.
సీనియర్ సిటిజన్లు, వృద్ధులు ప్రయాణాల్లో మొబైల్ ఫోన్లు వినియోగించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, కుటుంబ సభ్యులు కూడా వారికి ఈ తరహా సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని సీపీ సజ్జనర్ సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


