నాగర్కర్నూల్, బిజినేపల్లి: సామాన్యుడికి ప్రజాయుధంలాంటి సమాచార హక్కు చట్టం–2005 అమలులో బిజినేపల్లి మండల విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ చట్టానికి సంబంధించిన వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ, బిజినేపల్లి మండల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆర్టీఐ సమాచార బోర్డు కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
సమాచార హక్కు చట్టం–2005లోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం తమ కార్యకలాపాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా పౌర సమాచార అధికారి పేరు, ఫోన్ నంబర్, అప్పీల్ అధికారి వివరాలతో పాటు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని కార్యాలయంలో స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది.
నిత్యం విద్యుత్ సమస్యలు, బిల్లులు, కనెక్షన్లు తదితర అంశాలపై ప్రజలు వివిధ సమస్యలతో కార్యాలయానికి వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో తమకు అవసరమైన సమాచారాన్ని చట్టబద్ధంగా పొందేందుకు ఆర్టీఐ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కార్యాలయంలో ఆర్టీఐ వివరాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు అంటున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రూపొందించిన సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు, సంబంధిత అధికారుల వివరాలను కార్యాలయంలో స్పష్టంగా ప్రదర్శించాలని ప్రజలు కోరుతున్నారు.
బిజినేపల్లి మండల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆర్టీఐ సమాచారం బోర్డును ఏర్పాటు చేసి, పీఐఓ, అప్పీల్ అధికారి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల అమలుపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


