నాగర్‌కర్నూల్ జిల్లా: తిమ్మాజిపేట్ పోలీస్ స్టేషన్లో పాలమూరు మహేందర్‌పై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడి ఘటనను బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తీవ్రంగా ఖండించింది. బాధితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బీఎస్పీ నాయకులు ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిచిన మహేందర్‌పై తిమ్మాజిపేట్ ఎస్సై, కానిస్టేబుళ్లు దారుణంగా ప్రవర్తించారన్న ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తనపై దాడి చేయడంతో పాటు అవమానకరంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఘటనకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తిమ్మాజిపేట్ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను తక్షణమే విధుల నుంచి తొలగించాలని పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. బాధిత మహేందర్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని, పోలీసు రక్షణలోనే ఆయనకు చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మహేందర్ ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అప్పటివరకు ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వయిరీ నిర్వహించాలని కోరారు. ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్సీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారని, ఎమ్మెల్సీ స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పృథ్వీరాజ్ కోరారు.
అదేవిధంగా మహేందర్‌తో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వారిని అక్కడ మాజీ సర్పంచ్ వర్గానికి చెందిన వ్యక్తులు బెదిరించారని, గొంతు పట్టుకున్నారన్న ఆరోపణలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్లమెంట్ ఇంచార్జి సి. కళ్యాణ్, జిల్లా ఈసీ సభ్యుడు బాలస్వామి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష ముదిరాజ్, అసెంబ్లీ అధ్యక్షుడు పరుశరామ్, అసెంబ్లీ కమిటీ కార్యదర్శి మధు, తిమ్మాజిపేట్ మండల అధ్యక్షుడు శంకర్, తాడూర్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సెక్టార్ అధ్యక్షులు రాముడు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


