బిజినాపల్లి: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, బీఎల్ఏ కోఆర్డినేటర్ బంగారి పర్వతాలు డిమాండ్ చేశారు.
బిజినాపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అనేక హామీలు ఇచ్చినా వాటిలో చాలావరకు అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతోనే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ఇచ్చిన హామీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు తదితర హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు.
ప్రజలను తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టి ఆందోళనలకు తీసుకెళ్లి కేసుల పాలుచేయడం సరికాదన్నారు. ప్రజల సమస్యలపై నిజాయితీగా పోరాడితే ప్రజలే ఆదరిస్తారని, తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బంగారి పర్వతాలు అన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


