బిజినపల్లి, ఆగస్టు 25: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని ఆల్ సెయింట్స్ మోడల్ హై స్కూల్లో ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని సాంప్రదాయ పద్ధతుల్లో వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం జోసెఫ్, రీతా మాట్లాడుతూ.. ఓనం పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం ద్వారా మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించవచ్చని పేర్కొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జోసెఫ్ ఓనం పండుగకు సంబంధించిన పురాణ గాథను విద్యార్థులకు వివరించారు. పురాణ కథనం ప్రకారం మహాబలి చక్రవర్తి దయగల, న్యాయవంతుడైన రాజుగా ప్రజలను సమానంగా, సంతోషంగా పాలించేవాడని తెలిపారు. ఆయనను పరీక్షించేందుకు విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి మూడు అడుగుల స్థలం కోరారని, రెండు అడుగులతో భూమి, ఆకాశాలను కొలిచి, మూడో అడుగుకు మహాబలి తన తలను సమర్పించారని వివరించారు.
మహాబలి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఏడాదికి ఒకసారి తన ప్రజలను చూసేందుకు తిరిగి వచ్చే వరం ఇచ్చారని, మహాబలి తన ప్రజలను కలుసుకునేందుకు తిరిగి వచ్చే రోజునే ఓనం పండుగగా జరుపుకుంటారని తెలిపారు.
అనంతరం పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు పూలతో అందమైన అత్తుపూకాలం ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):




