నాగర్‌కర్నూల్: ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరవధిక బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాగర్‌కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ పిలుపునిచ్చారు. “పోరాడుదాం.. పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప” అనే నినాదంతో ఆటో కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.
నాగర్‌కర్నూల్ పట్టణంలోని కుమ్మెర ఆటో స్టాండ్, మన్ననూర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం యూనియన్ అధ్యక్షుడు ఎం.డి. రజాక్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మారేడు శివశంకర్ బంద్‌కు సంబంధించిన పిలుపును విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ తర్వాత ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో ఆటో రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వాలపై ఆధారపడకుండా అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రధాన డిమాండ్లు
ఆటో రవాణా రంగ డ్రైవర్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలు ఇవ్వాలనే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి.
ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించాలి.
ప్రజలకు రోజువారీ రవాణా సౌకర్యం కల్పించే ఆటో డ్రైవర్లను ఈ-చలాన్ల నుంచి మినహాయించాలి.
జీవో నంబర్ 263లో మిగిలిన ఆటోలను వెంటనే కేటాయించాలి.
వాహన సారథి హోటల్లో ఆటో డ్రైవింగ్ లైసెన్సుల ప్రక్రియను కొనసాగించాలి.
ప్రమాద బీమాను కొనసాగించడంతో పాటు సాధారణ మరణాలకు కూడా బీమా వర్తింపజేయాలి.
50 సంవత్సరాలు పూర్తయిన ఆటో కార్మికులకు పింఛన్లు అందించాలి.
ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.
పై డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్ల బంద్‌ను విజయవంతం చేయాలని శివశంకర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నపాగ శ్రీనివాసులు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆటో యూనియన్ నాయకులు, అధ్యక్షుడు ఎం.డి. రజాక్, ఆటో డ్రైవర్లు ఎం.డి. మాసూమ్, నిరంజన్, కృష్ణయ్య, కురుమయ్య, బాలస్వామి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


