తూర్పు కొండల్లో వెలుగు పుట్టినట్లు
కొండ కోనల్లో చెలిమ పారినట్లు
సప్త సముద్రాల్లో అలలు ఎగిసి పడినట్లు
సప్తపదిలో శబ్ద నిధి బయట పడ్డట్లు
మేఘాల మేనుల్లో ఉరుములు మెరుపులు
పుట్టినట్లు
కన్ను కన్ను కలబడి చూపుల కేకల్లో
పడుచు పిల్లల కేరింతల్లా
కవిత పుట్టింది.
అమృతం తాగిన ఆకాశం నక్షత్రాల
తళుకు బెళుకులకు తలుపులు తెరిచినట్లు
ఎగిరే పక్షి చెట్టును కలగన్నట్లు
కురిసే వానకు మట్టి మురిసినట్లు
వీచే గాలికి పైరు పరవశించినట్లు
సంధ్య పొద్దు పడమర అంతా పసిడిగా మారినట్లు
తీరం దాహంతో పరితపించినట్లు
చంద్రుడు సముద్రంలో దాగి తొంగి చూసినట్లు
కవిత ఒకటి పుట్టింది.
మల్లె పందిరిలో పూలు రాలి పరిమళించినట్లు
ఆకులు రాలి చిగురులు తొడిగినట్లు
మట్టి దుప్పటి కప్పుకున్న విత్తనం తల పైకెత్తినట్లు
పలకల్లో రుద్దిన అక్షరాలు రాలిపడి
మొలకల్లా మొలిచినట్లు...
అంధకారాన్ని అందంగా మార్చిన చందమామ
సిగ్గుపడి గగనంలో కవిగా మారినట్లు
కవిత ఒకటి పుట్టింది.
ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని
డా. ప్రతాప్ కౌటిళ్యా
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


