నాగర్‌కర్నూల్: మహిళలు, బాలికల భద్రతకు షీ టీం, భరోసా కేంద్రాలు అండగా ఉంటాయని, ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో షీ టీం, భరోసా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీం ఏఎస్ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ.. పోకిరీల వేధింపులు, ఆన్లైన్ మోసాలు, నమ్మించి మోసం చేసే ఘటనల పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బస్టాండ్లు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో షీ టీం నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు. ఆకతాయిల ఆట కట్టించేందుకు డేగకళ్లతో నిఘా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే షీ టీం 8712657676 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, బాలికలు తమ సమస్యలను దాచుకోకుండా ధైర్యంగా షీ టీంను ఆశ్రయించాలని కోరారు.
బాధితులకు భరోసా కేంద్రం అండ
భరోసా కోఆర్డినేటర్ శ్రీలత మాట్లాడుతూ.. పోక్సో, అత్యాచార చట్టాలపై బాలికలకు అవగాహన కల్పించారు. బాధితులకు భరోసా కేంద్రం ద్వారా కౌన్సెలింగ్, వైద్య, న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు అండగా షీ టీం, భరోసా కేంద్రాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
కళాజాత ద్వారా అవగాహన
కళాజాత బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి మహిళలు, బాలికల భద్రతపై పలు సందేశాలు అందించారు. అప్రమత్తత, చట్టపరమైన హక్కులు, సమస్యలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలను కళాజాత ప్రదర్శనల ద్వారా వివరించారు.
కార్యక్రమంలో షీ టీం ఏఎస్ఐ విజయలక్ష్మి, భరోసా కోఆర్డినేటర్ శ్రీలత, కళాజాత బృందం భాస్కర్ టీం, షీ టీం సభ్యులు వెంకటయ్య, కళాశాల ప్రిన్సిపాల్ అనసూయతో పాటు పలువురు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

