నాగర్కర్నూల్ జిల్లా:
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమని, దాని ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
నాగర్కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తెలకపల్లి మండలంలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. 197, 201 పోలింగ్ కేంద్రాల్లో మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. 2002 నాటి ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాను అనుసంధానం చేసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
నోటీసుల జారీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లు తమ అర్హతను నిరూపించుకునేందుకు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించే అవకాశం కల్పించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల అధికారిక ధ్రువపత్రాల్లో వర్తించే ఆధారాలను బీఎల్వోలకు సమర్పించాలని ఓటర్లకు సూచించారు.
ఓటర్లు సమర్పించిన ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాల పరిశీలన పూర్తయిన వెంటనే అర్హులైన ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలకపల్లి మండలంలో మ్యాపింగ్ కాని ఓటర్లు 582 మంది, అనామలీస్ జాబితాలో 6,974 మంది ఉన్నట్లు కలెక్టర్కు తహసీల్దార్ వివరించారు. మొత్తం 7,566 మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేసి అందజేస్తున్నట్లు తెలిపారు.
నోటీసులు అందని ఓటర్లకు సమాచారం చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నోటీసుల జారీ, ధ్రువపత్రాల స్వీకరణ, పరిశీలన, ఆన్లైన్ నమోదుపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
బీఎల్వోలు, బీఎల్ఏలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అనర్హులు, అనుమానాస్పద నమోదులను నిబంధనల ప్రకారం పరిశీలిస్తూ, సంబంధిత ఓటర్లకు తమ వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు.
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా అనవసరంగా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

