నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని భగవాన్ శ్రీ సత్యసాయి మందిరంలో శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా 49 మహిళా కుటుంబాల ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మహిళలు వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థించారు.
సత్యసాయి మందిర అర్చకులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరమశివుడిని పార్వతీదేవి వరంగా కోరిన వ్రతమే వరలక్ష్మీ వ్రతమని తెలిపారు. శ్రీ సూక్తాన్ని ప్రధానంగా చారుమతి బ్రాహ్మణ మహిళ తొలిసారిగా ఆచరించి భారతీయులకు అందించిన విశిష్ట వ్రతంగా పేర్కొన్నారు.
అమ్మవారిని వివిధ పూజా ద్రవ్యాలతో, ప్రత్యేక మంత్రోచ్ఛారణలతో పూజించడం ద్వారా కుటుంబాలకు ధన, ధాన్య, ధైర్య, విద్య, సంతానం, ఆరోగ్యం, సౌభాగ్యం, ఐశ్వర్యం వంటి అనేక వరాలు లభిస్తాయని వివరించారు. శ్రావణమాసంలో శ్రవణ నక్షత్రానికి, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ రూపంలో అమ్మవారిని పూజించడం అత్యంత విశిష్టమైనదని తెలిపారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచిన వారికి కొంగుబంగారంగా వరాలు ప్రాప్తిస్తాయని అన్నారు.
అనంతరం ఆలయంలో భక్తిభావంతో భజనలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా ఒకరికొకరు వాయనాలు, పసుపు, కుంకుమలు అందజేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సాయి సేవా సమితి కన్వీనర్ కొండూరు బాలరాజు, మహిళా కన్వీనర్ ఎం. సువర్ణ, సాయి గీత, సుప్రజ, కళ్యాణి, బలమని, అర్చన, నాగలక్ష్మి, శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ హకీం విశ్వప్రసాద్, కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్యతో పాటు సాయి భక్తులు ఇందిరమ్మ, శోభ, అరుణ, శారద, లలిత, పావని, సరిత, శ్రీను, భాస్కర్, పాండురంగారెడ్డి, సతీష్, లక్ష్మీపతి, మన్నెపురెడ్డి, ప్రసాద్, రాజు తదితరులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

