నాగర్కర్నూల్ జిల్లా: తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంగూరు మండలంలోని వంగూరు, పోల్కంపల్లి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాలను ఆయన సందర్శించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఆమోదించిన మ్యాప్, డిజైన్, నిర్మాణ ప్రణాళిక ప్రకారమే పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రతి నిర్మాణ దశలో నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే తదుపరి పనులు చేపట్టాలని సూచించారు.
నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగం పెంచి, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడమే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పాఠశాలల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు.
వేగం కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ వెంట డీఈఓ రమేష్ కుమార్, ఈడబ్ల్యూడీసీ ఇంజనీరింగ్ అధికారులు, వంగూరు తహసిల్దార్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


