నాగర్కర్నూల్: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత జిల్లా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో నిరంతరం చదువుతూ తమ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సూచించారు. బుధవారం ఆయన జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి వసతులు, పుస్తకాలు, అధ్యయన వనరులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ యువతీ యువకులతో కలెక్టర్ మాట్లాడి వారి చదువు ప్రణాళిక, రోజువారీ అధ్యయన సమయం, పోటీ పరీక్షల సన్నద్ధతలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
గ్రంథాలయంలోని జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, చరిత్ర, భూగోళశాస్త్రం, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను కలెక్టర్ పరిశీలించారు. సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ప్రతిరోజూ దినపత్రికలు చదవాలని, తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ పత్రికలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
డిజిటల్ గ్రంథాలయ సేవలు, ఆన్లైన్ అధ్యయన వనరులను కూడా ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. సోషల్ మీడియాకు అనవసరంగా సమయం కేటాయించకుండా సాంకేతికతను లక్ష్య సాధనకు ఉపయోగించుకోవాలని యువతకు హితవు పలికారు.
నిర్దిష్టమైన ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని, అందుకు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానం, గత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. క్రమశిక్షణతో నిరంతర సాధన చేయడంతో పాటు మాక్ టెస్టులు రాయడం, పునశ్చరణ చేయడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా గ్రంథాలయంలో చరిత్రకు సంబంధించిన 18,108 పుస్తకాలు, తెలుగు 9,768, ఇంగ్లిష్ 3,632, హిందీ 2,874, ఉర్దూ 1,726 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. అలాగే పోటీ పరీక్షలకు అవసరమైన తాజా సమాచారంతో 2,907 పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
యువతకు అవసరమైన పుస్తకాలు, సమాచార వనరులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి యువతలో అపారమైన ప్రతిభ దాగి ఉందని, దానిని సరైన దిశలో వినియోగించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

