అమరావతి: రాజధాని అమరావతి మీదుగా నిర్మించనున్న కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ కోసం భూ సమీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో మూడో దశ భూ సమీకరణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అమరావతి మీదుగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం–నంబూరు మధ్య నిర్మించనున్న కొత్త రైల్వే లైన్ కోసం అవసరమైన భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్పీఎస్) ద్వారా సమీకరించాలని నిర్ణయించారు.
రైల్వే లైన్‌కు ఇరువైపులా 50 మీటర్ల చొప్పున మొత్తం 100 మీటర్ల బఫర్ జోన్‌తో పాటు ఇంటర్నల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని మోతడక గ్రామంలో సమీకరించనున్నారు. గ్రామ సభ తీర్మానం మేరకు మొత్తం 2,344.12 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా సమీకరించేందుకు సీఆర్డీఏ నిర్ణయించింది.
భూ సమీకరణ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే అధికారాన్ని సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మోతడకలో మూడో దశ భూ సమీకరణకు మార్గం సుగమమైంది. అదేవిధంగా తాడికొండ, కంతేరు ప్రాంతాల్లోనూ భూ సమీకరణ చేపట్టాల్సి ఉంది.
రాజధాని ప్రాంతంలోని రెండో దశ భూ సమీకరణలో ఉన్న పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాల్లోని ఇనాం భూముల అంశంపై కూడా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 1,100 ఎకరాల దేవాదాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 340 ఎకరాలు దేవస్థానం పరిధిలో ఉండగా, మిగిలిన భూమి ఇనాం భూములుగా ఉంది. ఈ భూముల్లో 1958లోనే పట్టాదారు హక్కులు పొందిన రైతులు కూడా ఉన్నారు.
భూ సమీకరణ ఆలస్యం కావడానికి ఇనాం భూముల అంశం కూడా కారణంగా ఉన్న నేపథ్యంలో, ఆయా భూముల పట్టాదారులకు ఎల్పీఎస్ ప్యాకేజీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అధికారుల అంచనా ప్రకారం వడ్డమానులో సుమారు 70 ఎకరాలు, హరిశ్చంద్రాపురంలో 260 ఎకరాలు, వైకుంఠపురంలో సుమారు 400 ఎకరాలు, పెదపరిమిలో 100 ఎకరాల వరకు ఇనాం భూములు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో మరికొంత భూమి వివాదాస్పద లెక్కల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇనాం భూములకు కూడా తగిన ప్యాకేజీ, పరిహారం అందిస్తే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొస్తారని సీఆర్డీఏ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఇనాం భూముల పట్టాదారులకు ఎల్పీఎస్ ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది.
రాజధాని అభివృద్ధితో పాటు అమరావతి రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేసే దిశగా భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంలో తాజా క్యాబినెట్ నిర్ణయం కీలకంగా మారనుంది.


