తెలకపల్లి: పీఏసీఎస్ తెలకపల్లి ఆధ్వర్యంలో ఎఫ్ఈఓ సహకారంతో ఏర్పాటు చేసిన ప్యూర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మిల్లును ప్రిన్సిపల్ సెక్రటరీ కె. సురేందర్ మోహన్, ఐఏఎస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లులోని ప్రాసెసింగ్ యూనిట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నూనె తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
మిల్లులో ఏర్పాటు చేసిన యంత్రాల పనితీరు, నూనెగింజల ప్రాసెసింగ్ విధానం, నూనె తయారీ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, ప్యాకింగ్, మిల్లులో కొనసాగుతున్న కార్యకలాపాలపై సంబంధిత సిబ్బందిని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు స్వచ్ఛమైన, నాణ్యమైన కోల్డ్ ప్రెస్ నూనెలను అందించేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.
రైతులు పండించే నూనెగింజలకు స్థానికంగానే విలువ జోడించి, వాటి ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌కు అందించేందుకు పీఏసీఎస్ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ లభించడంతో పాటు అదనపు ఆదాయ అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు.
మిల్లు ఏర్పాటులో చొరవ చూపిన పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, సీఈఓ ధర్మవీర్లను ప్రిన్సిపల్ సెక్రటరీ అభినందించారు. మిల్లు ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కార్యకలాపాలను విస్తరించాలని సూచించారు.
రైతుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించడంతో పాటు, నాణ్యమైన నూనెలను ప్రజలకు అందించే దిశగా పీఏసీఎస్ చేపట్టిన కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు స్థానికంగా విలువ జోడించే ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీఓ రఘునాథరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మధు, సీనియర్ ఆడిటర్ పురుషోత్తం, సంఘం వైస్ చైర్మన్ యాదయ్య, కార్యవర్గ సభ్యులు రాజ మహేందర్ రెడ్డి, అచ్చుతా రెడ్డి, డొమైన్ నిపుణులు సృజన్, తరుణ్, రైతులు, సంఘం సిబ్బంది పాల్గొన్నారు

