తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలో మానవతా సేవా ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనే ధ్యేయంతో మానవతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మానవతా చిట్వేల్ శాఖ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు.
2004లో పశ్చిమగోదావరి జిల్లా జగ్గారెడ్డిగూడెంలో 108 మంది సభ్యులతో వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన మానవతా సంస్థ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాలు, 145 మండలాలకు విస్తరించి అనేక మానవతా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి శాంతియుత సమాజ నిర్మాణానికి కృషి చేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సంస్థ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా చిట్వేల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు పర్యవేక్షణలో పాఠశాల నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు విద్యార్థులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు శాంతి, మానవతా విలువలను ప్రతిబింబించే నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్యార్థులు, నిర్వాహకులు మానవహారంగా ఏర్పడి ప్రపంచ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ర్యాలీ అనంతరం విద్యార్థులకు మానవతా సభ్యులు బిస్కెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ డైరెక్టర్ తురక రంగారెడ్డి, తిరుమల విశ్వనాథం, కన్వీనర్ కరీంబాయి గారి సాయిరాం, చైర్మన్ వీరాంజనేయులు, కో-చైర్మన్ కుంభగిరి మునిరావు, అడ్వైజరీ బోర్డు సభ్యులు కావేరి చంద్ర, జనార్దన్ రావు (జానీ), పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎస్ఐ వెంకయ్య, కానిస్టేబుల్ విజయరెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


