చిట్వేల్: తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం నుంచి రాపూర్ వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుతలు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి పి. ధీరజ్ సూచించారు.
శ్రీ పెనుసిల నరసింహస్వామి అభయారణ్య పరిధిలో చిరుతల సంచారం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ప్రధాన రహదారి సమీపంలో చిరుతలు కనిపించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలు, వీడియోలు వాస్తవమేనని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ద్విచక్ర వాహనదారులు అప్రమత్తం
ఘాట్ రోడ్డులో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, పశువుల కాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పశువుల కాపరులకు సూచనలు
అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు మేకలు, గొర్రెలు, ఇతర పశువులను అడవుల వైపు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పశువులను ఒంటరిగా అడవి ప్రాంతాల్లోకి పంపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
చిరుతలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి
చిరుతలు కనిపించిన సమయంలో వాటిని వెంబడించడం, రెచ్చగొట్టడం లేదా ఎలాంటి హాని చేయడానికి ప్రయత్నించవద్దని ఎఫ్ఆర్ఓ పి. ధీరజ్ ప్రజలను కోరారు. చిరుతల సంచారం గమనించిన వెంటనే సమీప అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


