తెలకపల్లి: మండలంలోని దాసుపల్లి రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు సమీకృత వ్యవసాయం, పంటల మార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు విత్తనాలు, ఎరువుల వినియోగం, సరైన సమయంలో సరైన పద్ధతిలో పంటలకు నీటిని అందించే విధానాలపై అవగాహన కల్పించారు.
ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తక్కువ నీటితో సాగయ్యే చిరుధాన్యాలు, మినుములు, పెసర్లు, ఉలవలు వంటి తక్కువ కాలపరిమితి, తక్కువ నీటి వినియోగం కలిగిన పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. అదేవిధంగా కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై కూడా రైతులకు అవగాహన కల్పించారు.
ప్రస్తుతం పత్తి పంటలో కనిపిస్తున్న చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన వ్యవసాయ పద్ధతులపై సూచనలు చేశారు. రైతులు పంటల ఎంపిక, నీటి వినియోగం, ఎరువులు, విత్తనాల వినియోగంలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కేవీకే పాలెం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శైల, మండల వ్యవసాయ అధికారి పి. నర్మద రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రాధిక, శివకృష్ణతో పాటు దాసుపల్లి గ్రామానికి చెందిన రైతులు వీరారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

