నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాకొండ గ్రామానికి చెందిన నాగి బంగారమ్మ (43) హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తాడూర్ గ్రామానికి చెందిన ఎన్నుపోతుల భీమయ్య (38)ను నిందితుడిగా గుర్తించి ఆగస్టు 18న మధ్యాహ్నం సుమారు 12 గంటలకు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గత నాలుగేళ్లుగా బంగారమ్మతో భీమయ్యకు పరిచయం ఉంది. బంగారమ్మ తన పొలం విక్రయించిన సమయంలో భీమయ్య కొంత నగదును అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని బంగారమ్మ కొంతకాలంగా భీమయ్యను అడుగుతున్నట్లు పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతో బంగారమ్మను హత్య చేయాలని భీమయ్య పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్టు 15న డబ్బుల విషయమై మాట్లాడేందుకు బంగారమ్మను తన పొలం వద్దకు రావాలని భీమయ్య పిలిచినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో పొలం వద్దకు వెళ్లిన బంగారమ్మతో డబ్బుల విషయమై భీమయ్యకు గొడవ జరిగినట్లు తెలిపారు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో బొలెరో వాహనంతో బంగారమ్మను ఢీకొట్టి, ఆమెపై నుంచి రెండుసార్లు వాహనం నడిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో బంగారమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడు భీమయ్యను పోలీసులు అరెస్టు చేసి, అతని నుంచి TS 31 TA 4888 నంబర్ గల బొలెరో వాహనం, వివో వై39 మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మృతురాలికి చెందిన రెండు బస్ టికెట్లు, ఆధార్ కార్డు, చేతి సంచిని కూడా రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి, తాడూర్ ఎస్సై రాములు, కానిస్టేబుల్ రమేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

