న్యూఢిల్లీ: బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో సోమవారం ప్రకటించారు. కొత్త జాబితాలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులకు చోటు కల్పించారు. జాతీయ ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురందేశ్వరి సహా 13 మందిని నియమించారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్‌ను కొనసాగించగా, జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మరోసారి బాధ్యతలు అప్పగించారు.
సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివ ప్రకాష్, సౌధాన్ సింగ్, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా సునీల్ బన్సల్, వినోద్ తావుడే, విప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పునియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలకు అవకాశం కల్పించారు. సోషల్ మీడియా కన్వీనర్‌గా దీపక్, మీడియా కన్వీనర్‌గా అనిల్ బలోనిని నియమించారు.
బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ హేమంగు జోషి, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రూప్ కుమారి చౌదరి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమరుపాల్ మౌర్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బన్సీలాల్ గుజర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా శివేష్ కుమార్ రామ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా మన్నన్లాల్ రావత్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా కొన్వార్ బాసిత్ అలీలను నియమించారు.
నూతన జాతీయ కార్యవర్గంలో అనుభవజ్ఞులతోపాటు యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కూర్పు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


