5,10,16 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసులు వేయించుకోవాలి: నాగర్‌కర్నూల్ ఆర్డీవో అర్చన తెలకపల్లి:వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని నాగర్‌కర్నూల్ ఆర్డీవో అర్చన సూచించారు.సోమవారం తెలకపల్లి సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీవో అర్చన మాట్లాడుతూ డిఫ్తీరియా,పెర్టుసిస్ (కోరింత దగ్గు) వంటి వ్యాధుల నివారణకు 5,10,16 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలని తెలిపారు.వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గే రోగనిరోధక శక్తిని పెంచేందుకు బూస్టర్ టీకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకాలు అందేలా వైద్య సిబ్బంది పకడ్బందీ ప్రణాళికతో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు.టీకాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ లక్ష్మణ్ నాయక్,హెల్త్ సూపర్‌వైజర్ యశోద,హెల్త్ అసిస్టెంట్ సందీప్ రెడ్డి,ఏఎన్‌ఎంలు కవిత,శాంత,స్టాఫ్ నర్స్ పార్వతమ్మ,ఆశా కార్యకర్తలు పుష్ప,కురువమ్మ,భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

