తెలకపల్లి: ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం తెలకపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 19 శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మండల పరిధిలోని నాలుగు గ్రామాలకు చెందిన ప్రజల నుంచి మొత్తం ఐదు ఫిర్యాదులు అందాయి. తెలకపల్లి గ్రామం నుంచి పంచాయతీరాజ్ శాఖకు ఒక ఫిర్యాదు, పెద్దూరు గ్రామం నుంచి రెవెన్యూ శాఖకు రెండు, రాకొండ గ్రామం నుంచి రెవెన్యూ శాఖకు ఒకటి, గట్టురావిపాకుల గ్రామం నుంచి రెవెన్యూ శాఖకు మరో ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు అప్పగించడంతో పాటు ప్రజావాణి పోర్టల్లో నమోదు చేశారు. ఫిర్యాదుదారులకు ఆన్లైన్ అక్నాలెడ్జ్మెంట్ అందించారు. ఆయా సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 30 రోజుల్లోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి తరహాలోనే మండల స్థాయిలో కూడా ప్రజావాణిని పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 4 ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం, డబ్బు వృథా చేసుకోకుండా మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజావాణిలో సమర్పిస్తే వాటిని సంబంధిత శాఖలకు పంపించి ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మండల స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. – ప్రజావాణి నోడల్ అధికారి & ఎంపీడీఓ, తెలకపల్లి మండలం

