తెలకపల్లి: మండల పరిధిలోని కామారెడ్డిపల్లి గ్రామంలోని 5, 6వ వార్డుల్లో అండర్ డ్రైనేజీ పగిలిపోయి కొన్ని నెలలు గడుస్తున్నా సమస్యను పరిష్కరించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగిలిన డ్రైనేజీ నుంచి మురుగు నీరు బయటకు వచ్చి ఆలయం ముందు నుంచి ప్రవహిస్తున్నా గ్రామపంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని 5వ వార్డు సభ్యుడు గంగారం భాస్కర్ ఆరోపించారు. ఈ సమస్యను పలుమార్లు గ్రామపంచాయతీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గ్రామసభలోనూ ప్రస్తావించినప్పటికీ పరిష్కారం లభించలేదని ఆయన తెలిపారు. గ్రామసభ సమయంలో సమస్యలపై చర్చ జరిగినప్పటికీ అనంతరం వాటి పరిష్కారంపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదని విమర్శించారు. గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరురాలని, గ్రామంలోని రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్‌పై ఉంటుందని భాస్కర్ అన్నారు. 5, 6వ వార్డుల్లో డ్రైనేజీ సమస్యపై పలుమార్లు తెలియజేసినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకపోతే గ్రామంలో పారిశుధ్య సమస్యలు మరింత తీవ్రమై చెత్తకుప్పలు ఏర్పడే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ముందు మురుగు నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే పగిలిపోయిన అండర్ డ్రైనేజీలను పునరుద్ధరించి, మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని 5, 6వ వార్డుల ప్రజలు కోరుతున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని 5వ వార్డు సభ్యుడు గంగారం భాస్కర్ హెచ్చరించారు.

