తెలకపల్లి: మండల పరిధిలోని రాయిపాకుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారం, పంటల సాగుపై ఆందోళనతో రైతు సల్ల సుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం సుబ్బయ్యకు గ్రామంలో సుమారు 5 ఎకరాల సొంత భూమి ఉండగా, మరో 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి, వరి పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. పంటల సాగు కోసం అప్పులు చేయడంతో పాటు సకాలంలో వర్షాలు కురవక పంటలకు నీటి సమస్య ఏర్పడినట్లు పేర్కొన్నారు. పంటల దిగుబడిపై ఆందోళనతో పాటు అప్పుల భారం పెరగడంతో కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబ పోషణ, పిల్లల చదువుల ఖర్చులు, పంటల కోసం చేసిన అప్పులు తీర్చడం వంటి సమస్యలతో సుబ్బయ్య మనస్తాపానికి గురైనట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన ఆయన తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన సొంత పొలంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. సుబ్బయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, అర్హత మేరకు రైతు బీమా తదితర ప్రభుత్వ ప్రయోజనాలు అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మృతికి గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

