హైదరాబాద్: అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న రైతుబీమా పథకంపై అనిశ్చితి నెలకొంది. 2026–27 సంవత్సరానికి రైతుబీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అకాల మరణం చెందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. ఎల్ఐసీతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు.
ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీలోగా సుమారు రూ.1,400 కోట్ల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2026–27 సంవత్సరానికి సంబంధించిన ప్రీమియం ఇప్పటివరకు చెల్లించలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పథకం కొనసాగింపుపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
రాష్ట్రంలో సుమారు 42.16 లక్షల మంది రైతులు రైతుబీమా పథకం పరిధిలో లబ్ధిదారులుగా ఉన్నారు. పథకం నిలిచిపోతే అకాల మరణం సంభవించిన రైతు కుటుంబాలకు అందాల్సిన రూ.5 లక్షల బీమా పరిహారంపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుబీమా పథకాన్ని వెంటనే కొనసాగించి, ప్రీమియం చెల్లించి రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలని రైతు సంఘాలు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


