నాగర్‌కర్నూల్: జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు నూతన డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.
రాష్ట్రంలో సుమారు 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులైన కుటుంబాలకు అందిస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 20 మండలాల్లో 2,77,457 స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం, ఆహార భద్రతతో పాటు పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావడంలో రేషన్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డు కేవలం రేషన్ సరుకులు పొందేందుకు మాత్రమే కాకుండా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు తదితర ప్రయోజనాలను పొందేందుకు ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హత ఉన్నప్పటికీ ఇంతకాలం రేషన్ కార్డులు పొందలేకపోయిన కుటుంబాలను గుర్తించి కొత్త కార్డులు అందించడం ద్వారా సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చిన్నారెడ్డి అన్నారు. సన్న రకాల వరి సాగును ప్రోత్సహిస్తూ, సన్న రకాల ధాన్యం పండించే రైతులకు ప్రోత్సాహకంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తూ ధాన్యం సేకరిస్తున్నట్లు తెలిపారు. రానున్న రబీ సీజన్లో రైతులు సన్న రకాల సాగుపై దృష్టి సారించి ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు వారికి వివిధ ప్రోత్సాహకాలు, సంక్షేమ ప్రయోజనాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉన్నత చదువులు చదివించాలని చిన్నారెడ్డి సూచించారు. పేద కుటుంబాలకు ఆహార భద్రతతో పాటు విద్య, వైద్యం, గృహ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోందన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.
11 మందికి కారుణ్య నియామక పత్రాలు
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముందు ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ 11 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.
శివకుమార్ భార్య సుజాతకు పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియామకం.
ఫయాజ్ ఖాన్ భార్య తయాబా బేగంకు వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియామకం.
టీ. ఈశ్వరయ్య కుమారుడు టి. లింగస్వామికి మిషన్ భగీరథ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియామకం.
పి. కృష్ణయ్య కుమారుడు పి. రమేష్‌కు రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామకం.
ఎం.డీ. ఖాజా మొయినుద్దీన్ కుమారుడు షేక్ నిరంజన్‌కు వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామకం.
కె. భుచ్చ రావు కుమార్తె ధృవితకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామకం.
కె. రవీందర్ రెడ్డి కుమార్తె మహతికి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామకం.
జియాయుద్దీన్ కుమారుడు మొహమ్మద్ ఇర్షద్ అయాన్‌కు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామకం.
ఎన్. లక్ష్మయ్య కుమారుడు ముచమయ్యకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామకం.
కె. జంగయ్య భార్య సునీతకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామకం.
వి. శ్రీనివాసుల కుమారుడు వి. యాదగిరికి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో కారుణ్య నియామక పత్రం అందజేశారు.
అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, నాగర్‌కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత మల్లేష్, అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, రేషన్ డీలర్లు, 20 మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


