నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని కోరారు. జిల్లా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవలందించాలని సూచించారు.
జిల్లాలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అందుబాటులో ఉన్న అన్ని ఆరోగ్య సేవలను సకాలంలో, సమర్థవంతంగా అందించాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఇతర సిబ్బంది స్వాతంత్ర్య దినోత్సవం ప్రాధాన్యతపై మాట్లాడారు. పలువురు సిబ్బంది దేశభక్తి గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిశంకర్, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ అజీమ్, ఉపసంచాలకులు సీజే వసంత్, రామచంద్రయ్య, అన్ని విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


