మంతటి: డిండి ప్రాజెక్టు కోసం మంతటి గ్రామంలో వ్యవసాయ భూములను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మంతటి గ్రామంలో రైతుల పంట పొలాలను పరిశీలించిన ఆయన భూ సేకరణపై రైతులతో మాట్లాడారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం సుమారు 125 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రెండు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న తమ వ్యవసాయ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాగం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల జీవనాధారమైన వ్యవసాయ భూములను డంపింగ్ యార్డ్ కోసం తీసుకోవడం దారుణమని విమర్శించారు. డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ఎస్ఎల్బీసీతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల భూములను తీసుకుని వారి నోట్లో మట్టి కొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యపై జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతుల వ్యవసాయ భూముల జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని, భూ సేకరణను అడ్డుకుని రైతుల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.


