నాగర్‌కర్నూల్, ఆగస్టు 14: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ బీఎల్ఓలకు సూచించారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ ఐడీఓసీలో మండల స్థాయి ట్రైనర్లకు జిల్లా స్థాయి శిక్షణ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలోని 18 మంది మండల స్థాయి బీఎల్ఓ ట్రైనర్లకు ఎస్ఐఆర్ తదుపరి దశలపై అధికారులు శిక్షణ ఇచ్చారు. ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం బీఎల్ఓలు చేపట్టాల్సిన విధులు, నోటీసుల జారీ, ధ్రువీకరణ పత్రాల స్వీకరణ, పరిశీలన, ఆన్లైన్లో అప్లోడ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, ఓటరు పేరు తొలగింపునకు ఫారం–7, వివరాల సవరణకు ఫారం–8 వినియోగంపై శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 84 శాతం మ్యాపింగ్ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రుల పేర్లు, వయస్సు, ఇతర వివరాల్లో లోపాలు ఉన్న సుమారు 1.02 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. వీరి వివరాలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో చోటు కల్పించాలని ఆదేశించారు. అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా చూడటంతో పాటు అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకుండా బీఎల్ఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించిన ప్రతి వ్యక్తి పేరు ముసాయిదా ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. మ్యాపింగ్ కాని ఓటర్లు నిబంధనల ప్రకారం 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో అర్హమైన ఒక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి, వారు అందజేసిన ఆధారాలను భద్రపరచాలని ఆదేశించారు. నోటీసు ఎవరికి జారీ చేశారు, ఎవరికి అందజేశారు, ఓటరుతో వారి సంబంధం ఏమిటి అనే వివరాలను నమోదు చేయాలని సూచించారు. సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను డిజిటల్ రికార్డుగా భద్రపరచాలని ఆదేశించారు. విచారణకు హాజరైన వారి ఛాయాచిత్రాలు, హాజరు పట్టిక ఫొటోలను కూడా భద్రపరచాలని తెలిపారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే అర్హులైన యువత ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బీఎల్ఓలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయి ట్రైనర్లు తమ పరిధిలోని బీఎల్ఓలకు బీఎల్ఓ యాప్ తదుపరి కార్యాచరణపై ప్రాయోగిక శిక్షణ అందించాలని ఆదేశించారు. ఆర్డీఓల అధ్యక్షతన బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు.


