తెల్కపల్లి: చినుకు పడితే చిత్తడిగా మారి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెల్కపల్లి మండల కేంద్రంలోని నెహ్రూ (వివేకానంద) చౌరస్తాకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్ చొరవతో చౌరస్తా అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.
శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న చౌరస్తా పరిసరాల్లో రహదారిని ఆక్రమించి నిర్మించిన అరుగులు, రేకుల షెడ్లను స్థానిక యజమానుల సహకారంతో వారం రోజులుగా జేసీబీ సహాయంతో తొలగించారు. అనంతరం రహదారి ప్రాంతంలో సీసీ నిర్మాణ పనులు చేపట్టి చౌరస్తాను అభివృద్ధి చేస్తున్నారు.
రాజకీయాలకు అతీతంగా సహకారం
చౌరస్తా అభివృద్ధికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అఖిలపక్ష నాయకులు మద్దతు ప్రకటించారు. నడిరోడ్డుపై ఉన్న ఆయా పార్టీల దిమ్మెలను సైతం తొలగించేందుకు నాయకులు ముందుకు రావడం విశేషం.
అభివృద్ధి పనులను గమనించిన స్థానిక యువత, వ్యాపారులు, ప్రజలు సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్ చొరవను అభినందిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మండల కేంద్ర అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో గ్రామ ఉపసర్పంచ్ వారణాసి శ్రీను, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎం. యాదయ్య, సీనియర్ జర్నలిస్ట్ గుండూర్ శ్యామ్, వార్డు సభ్యులు, యువకులు తదితరులు పాల్గొని తమ సలహాలు, సూచనలు అందిస్తూ సహకరిస్తున్నారు. చౌరస్తా అభివృద్ధితో పాటు మండల కేంద్రంలోని ఇతర సమస్యల పరిష్కారానికి కూడా ఇదే తరహాలో సమష్టి కృషి కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


