నాగర్కర్నూల్, ఆగస్టు 13: కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నెలకొన్న మరుగుదొడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని BMP నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జ్ గడ్డం విజయ్ డిమాండ్ చేశారు.
పాఠశాలలో సుమారు 400 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికలు విద్యనభ్యసిస్తున్నారని, మొత్తం 30 మరుగుదొడ్లు ఉండగా కేవలం 8 మాత్రమే వినియోగంలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన మరుగుదొడ్లు మూసివేయబడి ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు తరగతి గదుల పక్కనే ప్రవహిస్తోందని ఆరోపించారు. దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆరోగ్యంపై ప్రభావం పడే పరిస్థితి ఉందన్నారు.
ప్రభుత్వం బాలికల విద్య, సంక్షేమం గురించి గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఆగస్టు 15న ‘బేటీ బచావో–బేటీ పడావో’ వంటి కార్యక్రమాలపై ప్రసంగాలు చేయడం కంటే బాలికలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
బీఎంపీ ప్రధాన డిమాండ్లు:
•పాఠశాలలోని మొత్తం 30 మరుగుదొడ్లను వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలి.
•పాఠశాలకు సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
•సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
తమ డిమాండ్లను 15 రోజుల్లో పరిష్కరించకపోతే, ఆగస్టు 23న నాగర్కర్నూల్లో నిర్వహించనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రణభేరి సభకు చిన్నంబావి తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి హాజరై మంత్రి నివాసం ముందు మహాధర్నా నిర్వహిస్తామని గడ్డం విజయ్ హెచ్చరించారు.
“పతాకాలు ఎగరేయడం మాత్రమే స్వాతంత్ర్యం కాదు. ప్రతి బాలికకు సురక్షితమైన మరుగుదొడ్డి, నాణ్యమైన విద్య, కనీస సౌకర్యాలు అందించడమే అసలైన స్వాతంత్ర్యం” అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సోషలిస్టు కూటమి రాష్ట్ర అధ్యక్షులు జిలకర బాలస్వామి, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు టి. ఆంజనేయులు పాల్గొన్నారు
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


