నాగర్కర్నూల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ టౌన్ అధ్యక్షుడు చవ్వ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ శివాలయం నుంచి నాగనూల్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.
ర్యాలీలో పాఠశాల, కళాశాల విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ఆటో స్టాండ్ యూనియన్, కార్మికులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఏబీవీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు చేతుల్లో మువ్వన్నెల జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలతో ర్యాలీలో ఉత్సాహంగా కదంతొక్కారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. మువ్వన్నెల జెండా దేశ గౌరవం, స్వాతంత్ర్యం, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ యువత దేశ ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు ముందువరుసలో నిలవాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులని, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ యువత, విద్యార్థులు దేశ చరిత్ర, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, భారత రాజ్యాంగ విలువలను తెలుసుకుని జాతీయతా భావంతో ముందుకు సాగాలని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం కేవలం జాతీయ జెండాను ఎగురవేయడం మాత్రమే కాదని, దేశం పట్ల గౌరవం, బాధ్యత, దేశభక్తిని వ్యక్తం చేసే గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజగుల నాగేందర్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు బుసిరెడ్డి సుబ్బారెడ్డి, ఆఫీస్ ఇన్చార్జి చందు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మ యాదవ్, ఓబీసీ మోర్చా జెట్టి వెంకటేష్, జిల్లా కార్యదర్శి చంద్రకళ, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు జానకి, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు పోల్దాస్ రాము, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు నామేశ్వర్ రెడ్డి, మాజీ టౌన్ అధ్యక్షుడు రాము, టౌన్ జనరల్ సెక్రెటరీ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


