తెలకపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న పాదయాత్రలు, ప్రచార యాత్రలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కౌకుంట్ల కేశవులు గౌడ్ పిలుపునిచ్చారు.
పాదయాత్రలో భాగంగా ఆరో రోజు తెలకపల్లి మండలంలోని గౌరెడ్డిపల్లి, కామారెడ్డిపల్లి, లక్నారం, గోలగుండం, జంగమోనిపల్లి, బొప్పెల్లి తదితర గ్రామాల్లో యాత్ర కొనసాగింది. అనంతరం ఆలేరు గ్రామానికి చేరుకుని మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కౌకుంట్ల కేశవులు గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని ఎన్డీఏ–బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరారు. ఆదివాసీలు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశం ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తోందని ఆయన ఆరోపించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితులు దిగజారుతుండగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. అవినీతిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
దేశంలో ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని సీపీఐ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు.
ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కౌకుంట్ల కేశవులు గౌడ్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లతో పాటు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. విద్యార్థినులకు స్కూటీలు, ‘తులం బంగారం’ హామీలను అమలు చేయాలని, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలకపల్లి మండల ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సూర్య శంకర్ గౌడ్, మారేడు శివశంకర్, సీపీఐ తెలకపల్లి మండల కార్యదర్శి వేనుపల్లి రవీందర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దేశమోని ఆంజనేయులు, సీపీఐ మండల సహాయ కార్యదర్శులు బుగ్గ స్వామి, నరేందర్ రెడ్డి, మండల నాయకులు దేశమోని బిచ్చయ్య, ఆలేరు గ్రామ శాఖ కార్యదర్శి దంతేల సీతయ్య, మారేడు బాలు, పెరుమండ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

