నాగర్ కర్నూల్ జిల్లా: పాడి రైతులకు పశువైద్య సేవలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. తిమ్మాజీపేట ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ పశువులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులు, వైద్య పరికరాలు, చికిత్సా విధానాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువులకు వ్యాధులు సోకినప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలని సూచించారు. టీకాలు, వైద్య పరీక్షలు నిర్ణీత సమయంలో జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో పశువుల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పశువుల యజమానుల ఆధార్ వివరాలతో పాటు పశువుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామాల వారీగా రైతులు, పశువుల వివరాలను సేకరించి, నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. అర్హులైన ప్రతి పాడి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, వెటర్నరీ ఆసుపత్రికి వచ్చే ప్రతి కేసును తప్పనిసరిగా నమోదు చేసి సకాలంలో వైద్యం అందించాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, టీకాలు, పశుపోషణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పశువైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పశుసంపద పరిరక్షణతో పాటు పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకుని, వాటిని సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

