తొలి కిరణం న్యూస్ తిమ్మాజీపేట: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్య సేవలు అందేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సూచించారు. మంగళవారం తిమ్మాజీపేటలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలను కలెక్టర్ పరిశీలించారు. చిన్నారుల ఎత్తు, బరువు వివరాలను పరిశీలించి, వయస్సుకు అనుగుణంగా ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు అదనపు పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం పంపిణీ, ఇతర పౌష్టికాహార కార్యక్రమాల అమలుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి చిన్నారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి అందాల్సిన పోషకాహారం, ఆరోగ్య సేవలు సకాలంలో అందుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ హెచ్చరించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి అవసరమైన వైద్య, పోషకాహార సేవలు అందించాలని సూచించారు.

