లింగాల, ఆగస్టు 11 (తొలి కిరణం న్యూస్): నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పండుగల సాయన్న విగ్రహం తొలగింపు అంశంపై ‘తొలి కిరణం’లో ప్రచురించిన వార్తకు ప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలో మంగళవారం 11-08-2026న పండుగల సాయన్న విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలంలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహం తొలగింపుపై ముదిరాజ్ సంఘాలు, సాయన్న అభిమానులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సానుకూలంగా స్పందించి, విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా భూమిపూజ నిర్వహించడంతో త్వరలో పండుగల సాయన్న విగ్రహం పునఃప్రతిష్ఠ జరగనుంది. దీంతో ముదిరాజ్ సంఘాల నాయకులు, సాయన్న అభిమానులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ‘తొలి కిరణం’ వార్త కీలక పాత్ర పోషించిందని పలువురు పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు అండగా నిలిచి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడమే ‘తొలి కిరణం’ లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు.

