తొలి కిరణం న్యూస్, నాగర్ కర్నూల్: పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో హరే కృష్ణ మిషన్ (అక్షయపాత్ర) ఆధ్వర్యంలో నూతన కిచెన్ షెడ్, వంట పరికరాలతో కూడిన ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఆదివారం హరే కృష్ణ మిషన్ (అక్షయపాత్ర) సభ్యులు పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాత శ్రీ జున్నా శేఖర్ రెడ్డి కోట్ల రూపాయల వ్యయంతో కిచెన్ షెడ్, అవసరమైన కిచెన్ పరికరాలతో సంపూర్ణ వంటశాలను నిర్మించనున్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 40 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అదేవిధంగా శ్రీ జున్నా శేఖర్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు మాత్రమే ప్రతిరోజూ 200 మందికి అక్షయపాత్ర ద్వారా నిత్యాన్నదానం అందించేందుకు హరే కృష్ణ మిషన్ (అక్షయపాత్ర) సంస్థ అంగీకరించింది. ఆలయ ప్రాంగణంలో ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చడంతో పాటు సంపూర్ణ సహకారం అందించేందుకు వంశపారంపర్య ధర్మకర్తలైన మనుసాని కుటుంబ సభ్యులు తమ అంగీకారాన్ని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మనుసాని కుటుంబ సభ్యులకు, శ్రీ రెడ్డి నారాయణరెడ్డి సోదరులకు, దాత శ్రీ జున్నా శేఖర్ రెడ్డి గారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం సాకారం కావడానికి శ్రీ మనుసాని విష్ణుమూర్తి చూపిన చొరవను పలువురు అభినందించారు. అక్షయపాత్ర కేంద్రం ఏర్పాటుతో విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు, ఆలయానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం అందుబాటులోకి రానుండటంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

