బిజినేపల్లి, ఆగస్టు 9 (తొలి కిరణం న్యూస్ రిపోర్టర్ మధు సూదన్): దేశభక్తి, నిస్వార్థ సేవాభావంతో యువత ముందుకు సాగితేనే భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దవచ్చని ఆర్ఎస్ఎస్ ప్రముఖులు అన్నారు. బిజినేపల్లి మండలం పాలెంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన యువ సమ్మేళనంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, స్వభావాన్ని మెరుగుపరుచుకుని దేశం కోసం పనిచేసే స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. సైనిక సేవలో చేరడం ద్వారా యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత మరింత పెంపొందుతాయని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితం కాకుండా దేశ సేవా స్ఫూర్తితో పనిచేస్తే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతే దేశ భవిష్యత్ అని, యువత సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రత్యేక దృష్టితో ముందుకు సాగాలని సూచించారు. దేశభక్తి, కర్తవ్యనిష్ఠ, సేవాభావం, జాతీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. పంచ పరివర్తన్తో సామాజిక మార్పు స్వబోధ్, నాగరిక కర్తవ్యం, పర్యావరణ శుద్ధి, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్ అనే పంచ పరివర్తన్ అంశాలను చిత్తశుద్ధితో ఆచరిస్తే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. ముఖ్యంగా యువ న్యాయవాది ధనాల పూర్ణిమ మాట్లాడుతూ యువత సామాజిక మార్పులో సమయాన్ని వృథా చేసుకోకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. దేశభక్తి, కర్తవ్యనిష్ఠ, సేవాభావం, జాతీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, మహనీయుల త్యాగాలపై యువత అవగాహన పెంచుకోవాలని అన్నారు. యువ సమ్మేళనంలో చిన్మయి శాంతి సింగ్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సహ వ్యవస్థ ప్రముఖ్ ఆగసు నాగయ్య, ధర్మజాగరణ ప్రముఖ్ అతినారాయణ్, జిల్లా పర్యావరణ ప్రముఖ్ పబ్బతి నిరంజన్, హిందూ సంఘాల కార్యకర్తలు, విద్యార్థులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

